అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆదివారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. సెప్టెంబర్ 10 తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదల అవుతుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పెడుతామన్నారు.
Local Body Elections | ఎన్నికల సంఘం అడుగులు
స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం (SEC) అడుగులు వేస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఓటర్ల జాబితా కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. శనివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటరు జాబితా కోసం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా ముసాయిదా ప్రతి విడుదల చేయాలని, అనంతరం అభ్యంతరాలు స్వీకరించి అదే నెల 10న తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.
Local Body Elections | ఆశావహుల్లో ఉత్కంఠ
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి నుంచి గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ టర్మ్ అయిపోయి కూడా ఏడాది దాటింది. దీంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తం అయింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల కోసం ప్రజలతో పాటు, నాయకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికల తేదిపై స్పష్టత లేకపోవడంతో ఏ రిజర్వేషన్ (Reservations) ఖరారు అవుతుందో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మంత్రి ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు ఖరారు అయితే పోటీలో దిగే అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది.