అక్షరటుడే, వెబ్‌డెస్క్: Local body election | రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం తెలంగాణ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలపడమే కాకుండా ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. దీంతో అతి త్వరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది.
రాష్ట్రంలో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర గడిచింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలపై గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 2న ఓటరు తుది జాబితాను విడుదల చేయనుంది. కాగా.. ఇదే సమయంలో శనివారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఆమోదం తెలిపింది.
Local body election | త్వరలోనే నోటిఫికేషన్..
స్థానిక ఎన్నికల నిర్వహణపై సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. జిల్లాల వారీగా బ్యాలెట్ బ్యాక్సుల పంపిణీ పూర్తయింది. సిబ్బంది వివరాలను సైతం సేకరించిన ఎన్నికల సంఘం.. తుది ఓటరు జాబితాను విడుదల చేయడమే తరువాయిగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు మొదటి వారంలోనే లోకల్ బాడీలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందా? అనేది ఇంకా స్పష్టత లేదు.