అక్షరటుడే, వెబ్డెస్క్ : Lobo | టెలివిజన్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు, యాంకర్, బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్(Bigg Boss 5 Contestant) లోబో (అసలుపేరు ఖయూమ్)కు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏడు సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాలు కోల్పోయేలా చేశారన్న ఆరోపణలపై, లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో లోబో(Lobo)తో పాటు ఆయన అభిమానులు ఉలిక్కిపడ్డారు. అసలు లోబో చేసిన తప్పేంటి, ఆయనకు ఎందుకు జైలు శిక్ష పడింది అనే వివరాలు చూస్తే..
Lobo | చిక్కుల్లో లోబో..
2018 మే 21న ఓ టీవీ ఛానల్ కోసం వీడియో షూటింగ్ కోసం లోబో టీమ్ వరంగల్ జిల్లా(Warangal District)లోని రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లింది. అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో లోబో స్వయంగా కారు నడుపుతూ రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వస్తున్న ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే ఆటోలో ఉన్న మరికొందరికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రమాద తీవ్రతతో లోబో ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది. లోబోతో పాటు కారులో ఉన్న ఇతర సభ్యులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు రఘునాథపల్లి పోలీసు(Raghunathapalle Police)లకు ఫిర్యాదు చేయగా, పోలీసులు లోబోపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఏడేళ్ల పాటు కొనసాగిన విచారణ తర్వాత, జనగామ కోర్టు ఈ కేసులో న్యాయ నిర్ణయం తీసుకుంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసిన లోబోకు ఏడాది సుదీర్ఘ జైలు శిక్ష, అలాగే రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి(CI Srinivas Reddy), ఎస్సై నరేష్(SI Naresh)లు మీడియాకు ధృవీకరించారు.ప్రస్తుతం ఈ తీర్పుపై లోబో నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, అతడు పైకోర్టు(High Court)ను ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బిగ్‌బాస్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న లోబో జీవితంలో ఈ తీర్పు కీలక మలుపుగా మారనుంది.