అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. పంట రుణాల పంపిణీకి (crop loan distribution) అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
కలెక్టరేట్లో బుధవారం జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున పంట రుణాల లక్ష్యాన్ని అధిగమించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అర్హత కలిగిన రైస్ మిల్లర్లకు (eligible rice millers) వెంటనే గ్యారెంటీలను మంజూరు చేయాలని సూచించారు.
కొత్త రైస్ మిల్లర్లకు కూడా ప్రాపర్టీ మార్ట్గేజ్ (property mortgage) చేసుకొని బ్యాంక్ గ్యారంటీ అందించాలని చెప్పారు. వ్యవసాయ శాఖతో పాటు డీఆర్డీఏ, మెప్మా, పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ తదితర శాఖలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన వారికి సకాలంలో రుణాలు అందించాలన్నారు.
Nizamabad Collector | బ్యాంకర్ల గైర్హాజరు.. కలెక్టర్ అసహనం
సమావేశానికి పలువురు బ్యాంకర్లు గైర్హాజరు కావడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కీలక సమావేశానికి బ్యాంకర్లు రానప్పుడు సమావేశం నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. గైర్హాజరైన బ్యాంకర్ల గురించి మినిట్స్ బుక్స్‌లో పొందుపర్చి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ (Additional collectors Ankit), కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, లీడ్ బ్యాంకు మేనేజర్ సునీల్, ఆర్బీఐ ఎల్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.