Nizam Sagar
Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో

అక్షరటుడే, నిజాంసాగర్ : Nizam Sagar | రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మెదక్ ​(Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో కురిసిన వర్షాలతో నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (Nizamsagar Project)కు స్వల్ప ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​లోకి వరద ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం జలాశయంలోకి 1,269 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నట్లు ఈఈ సోలోమాన్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1390.50 అడుగుల (4.25 టీఎంసీలు) నీరు ఉంది.

Nizam Sagar | పొంగిపొర్లుతున్న ‘ఘనపురం’

మంజీర నదిపై (Manjira River) నిర్మించిన నిజాంసాగర్​కు కర్ణాటకలో వర్షాలు పడితేనే భారీగా వరద వస్తుంది. మంజీరకు వరద వస్తే మొదట సింగూరు ప్రాజెక్ట్​ నిండాలి. అనంతరం దిగువకు నీటిని విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం సింగూరుకు కూడా స్వల్ప ఇన్​ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్ట్​ ఇప్పట్లో నిండే అవకాశాలు లేవు. అయితే మంజీరపై ఏడుపాయల దేవాలయం సమీపంలో గల ఘనపురం ఆనకట్ట నిండింది. డ్యామ్​పై నుంచి నీరు పొంగిపొర్లుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో మంజీరలోకి భారీగా వరద వస్తోంది. దీంతో నిజాంసాగర్​కు ఇన్​ఫ్లో పెరిగే అవకాశం ఉంది.

Nizam Sagar | పోచారం ప్రాజెక్ట్​ ఆదుకుంటుందా..

కామారెడ్డి, మెదక్​ సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project)కు భారీగా వరద వస్తోంది. లింగంపేట పెద్ద వాగు, గుండారం వాగులు ఉధృతంగా పారుతున్నాయి. దీంతో జలాశయానికి ఇన్​ఫ్లో భారీగా వస్తోంది. ఇలాగే వరద కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్​ నిండి అలుగు పారనంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ను పోచారం డ్యామ్​ ఆదుకుంటుంది. ఈ డ్యామ్​ పొంగిపొర్లడంతో వచ్చిన నీటితోనే నిజాంసాగర్​కు భారీగా వరద వచ్చింది. ఈ సారి కూడా పోచారం జలాశయం అలుగు పారితే నిజాంసాగర్​కు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది.

Nizam Sagar | ఉమ్మడి జిల్లా వరప్రదాయిని

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా రైతులకు సాగు నీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్​ కింద 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. బాన్సువాడ (Bansuwada), బోధన్​ (Bodhan) నియోజకవర్గాల్లోని రైతులు ప్రాజెక్ట్​ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. దీంతో ప్రాజెక్ట్​ నుంచి జులై 15న నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్ట్​ నిండితే రెండు పంటలకు ఢోఖా ఉండదని రైతులు అంటున్నారు.