అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సీఎం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో జూమ్ మీటింగ్లో మాట్లాడారు. ఆయా జిల్లాల్లోని నాయకులతో ఇంఛార్జి మంత్రులు మాట్లాడాలని సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే స్థానాలకు గురువారం రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం వారికి బీ ఫారాలు (B Forms) అందించాలన్నారు. నో డ్యూ సర్టిఫికెట్లు సైతం ఇప్పించాలని సూచించారు.
CM Revanth Reddy | టీమ్లు ఏర్పాటు చేయాలి
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. లీగల్ సెల్ (Legal Cell)ను యాక్టివ్ చేయాలని ఆదేశించారు. గాంధీ భవన్ (Gandhi Bhavan)లో లీగల్ టీమ్ తో పాటు సమన్వయం కోసం ఒక టీమ్ అందుబాటులో ఉండాలన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కోర్టు తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.
CM Revanth Reddy | ప్రారంభమైన నామినేషన్లు
రాష్ట్రంలోని 565 జెడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సీఎం కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అయితే అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. వారిలో ఎవరికి టికెట్ దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది.