అక్షరటుడే, వెబ్డెస్క్: Wine Shops | రాష్ట్రం మద్యం దుకాణాల (liquor stores) దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణల టెండర్ (Liquor Store Tender) కోసం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ 18 వరకు మాత్రమే గడువు ఉండగా.. దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు 23 వరకు పొడిగించారు.
మొదట్లో దుకాణాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే గడువు సమీపిస్తున్న కొద్ది దరఖాస్తులు పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజు 25 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారం చివరి రోజు 50 వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే 38,754 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Wine Shops | 27 డ్రా తీయనున్న అధికారులు
నోటిఫికేషన్ ప్రకారం 18 వరకు దరఖాస్తులు తీసుకొని 23న లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే బీసీ బంద్ (BC bandh) నేపథ్యంలో చివరి రోజు దరఖాస్తులు చేసుకోలేకపోయామని కొందరు ఫిర్యాదులు చేశారు. మరోవైపు లక్షకు పైగా అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు మొత్తం 85,363 దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23 వరకు గడువు పొడిగించారు 19న ఆదివారం, 20న దీపావళి కావడంతో సెలవు ఉంటుంది. దీంతో 21, 22, 23 తేదీల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 27 లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.
Wine Shops | దరఖాస్తు ఫీజు పెంచడంతో..
గతంలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు (application fee) రూ.రెండు లక్షలు ఉండగా.. ఈ సారి రూ.మూడు లక్షలకు పెంచారు. దీంతో దరఖాస్తులు తగ్గాయి. 2023లో 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా గడువు పొడిగించడంతో దరఖాస్తులు లక్షకు పైగా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.