అక్షరటుడే, హైదరాబాద్ : Sky Lamp | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో , దేవాలయాల్లో కనిపించే ప్రత్యేక దృశ్యం ‘ఆకాశదీపం’.
శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి, దీపం వేలాడదీస్తారు. భక్తులు దీన్ని చూసి భక్తితో నమస్కరిస్తారు. అసలు ఆకాశం వైపు దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం ఏంటి? కార్తీక పురాణం (Karthika Puranam) దీని గురించి ఏం చెప్తోంది? ఈ దీపారాధన మహత్యం ,ప్రయోజనాలు తెలుసుకుందాం.
Sky Lamp | కార్తీక మాసంలో ఆకాశదీపం ప్రాముఖ్యత:
కార్తీక మాసం (Karthika Masam) పూజలు, అభిషేకాలు, వ్రతాలు, నదీ స్నానాలకు ఎంతో విశిష్టమైనది. ఈ పుణ్య మాసంలో ఆకాశదీపం వెలిగించడం లేదా దర్శించడం వెనుక రెండు ప్రధానమైన మహత్యాలు ఉన్నాయి.
Sky Lamp | పితృదేవతలకు మార్గం చూపడం:
కార్తీక పురాణం ప్రకారం : ఆకాశదీపం (Sky Lamp) ముఖ్యంగా పితృదేవతలకు మార్గం చూపుతుందని ప్రస్తావిస్తారు.పితృదేవతలు ఆకాశ మార్గాన తమ లోకాలకు ప్రయాణించే సమయంలో వారికి సరైన దారి కనిపించేలా, ఈ దీపాన్ని ఆకాశం వైపు కడతారు.ఈ దీపాన్ని చూసి పితృ దేవతలను స్మరించుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం.
Sky Lamp | శివ కేశవుల తేజస్సును అందించడం:
అజ్ఞానపు చీకట్ల తొలగింపు : ఆకాశదీపం శివ (త్రయంబకుడు) ,కేశవుల (దామోదరుడు) తేజస్సును జగత్తుకి అందిస్తుందని హిందువులు నమ్ముతారు.ధ్వజస్తంభంపై నుంచి వెలిగే ఈ దీపం కాంతి మొత్తం భూమండలానికి వెలుగును అందించి, ప్రజల అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుందని ప్రతీతి.ఆకాశ దీపం కాంతిలో ఉన్న ప్రాంతాన్ని శివయ్య (Lord Shiva) స్వయంగా కాపాడతారని కూడా భక్తులు విశ్వసిస్తారు.
Sky Lamp | ఆకాశదీపం వెలిగించే విధానం:
సాధారణంగా శివాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వేలాడదీస్తారు.కొంతమంది భక్తులు (Devotees) పితృదేవతలకు త్రోవ కనిపించాలనే ఉద్దేశ్యంతో ఇళ్లల్లో కూడా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలించి ఆకాశదీపాన్ని వెలిగిస్తారు.
Sky Lamp | ఆకాశదీపం దర్శించేటప్పుడు పఠించాల్సిన మంత్రం:
ఆకాశదీపాన్ని చూసి నమస్కరించేటప్పుడు లేదా వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి.“దామోదర మావాహయామి త్రయంబక మావాహయామి”
అంటే దామోదరుడిని (విష్ణువును), త్రయంబకుడిని (శివుడిని) ఆవాహనం చేస్తున్నాను అని అర్థం.

