అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Updates | వరుణుడు శాంతించాడు. వారం రోజుల పాటు దంచికొట్టిన వానలు తెరిపినిచ్చాయి. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేకపోవడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains) కురిసిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది.
Weather Updates | చిరుజల్లులు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. సాయంత్రం పూట అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
Weather Updates | భారీ వర్షాలు మళ్లీ అప్పుడే..
నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండనుంది. ఆగస్టు 26 నుంచి 29 మధ్య మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆగస్టు 27, 28 తేదీల్లో కుండపోత వాన పడుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఆ సమయంలో మోస్తరు వానలు పడతాయి.
Weather Updates | రైతులు బిజీ
వారం రోజుల పాటు వర్షాలు పడడంతో రైతులు (Farmers) పొలం పనులు చేయలేదు. ప్రస్తుతం వరి పొలాలకు ఎరువులు చల్లాల్సిన సమయం. వర్షాల నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు ఆగిన రైతులు వరుణుడు తెరిపినివ్వడంతో వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు. పొలాలకు యూరియా, ఇతర ఎరువులు చల్లుతున్నారు. పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో యూరియా కొరత (Urea Shortage) ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.