అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.
కాగా.. నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిండడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు సమాచారం అందించడంతో అర్ధరాత్రి ఆయన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి 58,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీర నదిలోకి విడుదల చేశారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1403.25 అడుగులు (15.323 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ఈఈ సొలోమన్ తెలిపారు. ఎగువ నుంచి భారీ ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో ఏడు వరదగట్ల ద్వారా 58,500 క్యూసెక్కుల నీటిని మాజీరలోకి విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు నీటి విడుదల కొనసాగిస్తామని ముందుగా అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ అర్ధరాత్రి భారీ ఇన్ఫ్లో రావడంతో సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో నీటి విడుదలను ప్రారంభించారు.
కౌలాస్నాలా గేట్లు ఎత్తివేత
జుక్కల్ నియోజకవర్గంలోని మరో ప్రాజెక్టు అయిన కౌలాస్ నాలా గేట్లు సైతం ఎత్తారు. ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 29,444 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టు ఐదు వరద గేట్ల ద్వారా 31,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు (1.237 టీఎంసీలు) గాను 457.80 మీటర్ల (1.200 టీఎంసీలు) మేరు నీరు నిల్వ ఉంది.
పొంగిపొర్లుతున్న సింగితం
నిజాంసాగర్ ప్రాజెక్టు అనుబంధంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. సింగితం రిజర్వాయర్ అలుగు పొంగిపొర్లుతుండడంతో మహమ్మద్ నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.