అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)కు శనివారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. మైసూర్‌లోని ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసు(Rape Case)లో రేవణ్ణపై ఆరోపణలు రుజువు కావడంతో 14 నెలల తర్వాత దోషిగా తేలుస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
Prajwal Revanna | గతేడాది ఇంటి పనిమనిషి ఫిర్యాదు
రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్(Farm House)లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మహిళ గతేడాది ఏప్రిల్‌లో రేవణ్ణపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2021 నుంచి రేవణ్ణ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. ఎవరికైనా చెబితే వీడియోలను విడుదల చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేవణ్ణను గతేడాది మే 31న అరెస్టు చేశారు.
Prajwal Revanna | 14 నెలల్లో తీర్పు
ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జిషీటును కోర్టులో సమర్పించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(Forensic Science Lab) నివేదికలు, స్పాట్ ఇన్‌స్పెక్షన్ నివేదికలు, బాధితురాలు సమర్పించిన భౌతిక సాక్ష్యాలు(చీరపై స్పెర్మ్ ఆనవాళ్లు) ఈ కేసులో కీలకంగా మారాయి. 23 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన కోర్టు, ఈ సాక్ష్యాల ఆధారంగా ప్రజ్వల్‌ను దోషిగా నిర్ధారించింది.
Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో చర్చ
ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు(Special Court), ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చి, జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో వివిధ సెక్షన్ల కింద అతడికి కనీసం పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేశారు. కోర్టు తీర్పు ప్రకటించిన సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులోనే ఏడ్చినట్లు అక్కడి న్యాయవాదులు తెలిపారు. ఈ తీర్పు కర్ణాటక రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.