అక్షరటుడే, వెబ్డెస్క్ : LG Electronics | ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారంలో రెండు భారీ ఐపీవోలు లిస్టయ్యాయి. మెయిన్‌బోర్డ్‌నుంచి వచ్చిన టాటా క్యాపిటల్(Tata Capital) ఫ్లాట్‌గా లిస్టయి నిరాశ పరచగా.. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా(LG Electronics India) మాత్రం భారీ లాభాలను అందించింది.
గృహోపకరణాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ తయారీదారు అయిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రూ.11,607 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూ(Public Issue)కు వచ్చింది. ఈనెల 7 నుంచి 9 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. 54 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ కాగా.. రిటైల్ కోటా 3.55 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ రూ.11,607 కోట్ల కోసం ఐపీవోకు రాగా.. ఇన్వెస్టర్లు రూ. 4 లక్షల కోట్ల షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో రోజురోజుకు ప్రీమియం పెరుగుతూ రావడంతో మరింత ఆసక్తి నెలకొంది. కంపెనీ షేర్లు మంగళవారం(అక్టోబర్ 14న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధరను(గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద) రూ. 1,140 గా నిర్ణయించగా.. 50 శాతం ప్రీమియం(Premium)తో రూ. 1,710 వద్ద లిస్టయ్యింది. అంటే ఒక్కో షేరుపై రూ. 570 లాభం వచ్చిందన్న మాట. ఒక లాట్ ధర రూ. 14,820 కాగా.. లిస్టింగ్ సమయంలోనే ఇన్వెస్టర్లకు రూ. 7,400 లాభం(Profit) వచ్చింది.
కాగా సోమవారం లిస్టయిన మరో భారీ ఐపీవో(IPO) టాటా క్యాపిటల్ ఇన్వెస్టర్లను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ ఐపీవో ధర రూ. 326 కాగా.. రూ. 330 వద్ద లిస్టయ్యింది. 1.23 శాతం లాభాలు మాత్రమే వచ్చాయి. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మాత్రం భారీ లాభాలను ఇచ్చింది.