అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుపొందించి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం నుంచి బహుమతి ఇద్దామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (Jukkal MLA Laxmikant Rao) అన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నర్సింగ్ రావు పల్లి సర్కిల్ వద్ద ఘనస్వాగతం పలికారు.
అక్కడి నుంచి పిట్లం సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సన్మానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ అగ్ర నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ నియామక ప్రక్రియ మొదలైన నాటి నుంచి తనకు మద్దతిచ్చి అండగా నిలిచి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
Jukkal MLA | బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా..
అధిష్టానం తన మీద విశ్వాసం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మల్లికార్జున్ తెలిపారు. అందరి సలహాలు, సూచనలు పాటిస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్‌ను నియమించడం జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) గర్వకారణమన్నారు.
ఒక సామాన్య కార్యకర్త జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో (Congress party) కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం లభిస్తుందని చెప్పడానికి మల్లికార్జున్ నియామకమే ఉదాహరణ అని చెప్పారు. ఆయన నిబద్ధత కలిగిన నాయకుడన్నారు. ఆయన సారథ్యంలో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. కార్యకర్తలు ఇందుకోసం అహర్నిషలు కృషి చేయాలని సూచించారు.