అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | హైదరాబాద్‌ను కాలుష్య రహిత రాజధానిగా మార్చుకుందామని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. శాసనసభ సమావేశాల్లో (Legislative Assembly sessions) భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ప్రస్తుతం గ్లోబల్ సిటీగా మారిందని, అంతర్జాతీయ సదస్సులు, పెట్టుబడి సమావేశాలు తరచూ జరుగుతున్నాయన్నారు.
Yellareddy MLA | వేగంగా పెరుగుతున్న కాలుష్యం
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ (Hyderabad) ఒకటని ఎమ్మెల్యే అన్నారు. అయితే అంతే వేగంగా వాహనాల కాలుష్యం సైతం పెరుగుతోందన్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పీయూసీ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలే ప్రధాన కాలుష్య కారకాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ వాహనాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. వాహన సారథి డేటాబేస్‌లను అనుసంధానం చేసి ప్రతి వాహనం ఫిట్‌నెస్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ వివరాలను పర్యవేక్షించే సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
Yellareddy MLA | కాలుష్యం కారణంగా లక్షల్లో మరణాలు..
కాలుష్యం కారణంగా భారత్‌లో ఏటా 16–17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆస్థమా, క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కాలుష్యమే ప్రధాన కారణమని తెలిపారు. వాయు కాలుష్యానికి కారణమయ్యే వారిని నేరస్థులుగా పరిగణించాల్సిందేనని ఎందుకంటే వారు పరోక్షంగా మానవ జీవితాలపై దాడి చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ నగరం కాలుష్యంతో జీవించలేని స్థితికి చేరిందని.. హైదరాబాద్ అటువంటి పరిస్థితికి చేరకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలని కోరారు.