అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అమరుల స్ఫూర్తితో కల్లు గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధమవుదామని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్ర కార్యక్రమాన్ని (Geethannala Social Awareness Yatra program) కామారెడ్డి పట్టణంలో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లుగీత వృత్తిని రక్షించడానికి అనేకమంది వీరులు పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని గుర్తు చేశారు. అలాంటి హక్కులను నేటి ప్రభుత్వాలు రద్దు చేయాలని చూస్తే కల్లు గీత కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎన్నికల్లో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి గ్రామానికి ఈత, తాటి చెట్లు పెంచుకోవడానికి పది ఎకరాల భూమిని ఇవ్వాలని కోరారు. ప్రతి గీత కార్మికుడికి బైక్ ఇవ్వాలని, గ్రామానికి టాటా ఏస్ వాహనం (Tata Ace vehicle) ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తిని నమ్ముకొని రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నారని, వృత్తిని రక్షిస్తే మూడు లక్షలతో పాటు ఇంకా ఆదనంగా మూడు లక్షల మంది గౌడ గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
మద్యం ఫ్యాక్టరీల యజమానుల కోసం, ప్రభుత్వానికి ఆదాయం కోసం కల్లు గీత వృత్తిని తగ్గించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కల్లు గీత వృత్తిపై కల్తీ పేరిట దాడి చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. కల్లు గీత వృత్తికి నష్టం చేయాలని చూస్తే గీత కార్మిక సంఘం (Geeta Workers Association) పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడ కల్లుగీత కార్మికులందరూ ఐక్యంగా వృత్తి రక్షణ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు బాలా గౌడ్, శేఖర్ గౌడ్, మల్లాగౌడ్, సిద్దగౌడ్, అంజాగౌడ్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.