అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirupati | తిరుపతిలో మరోసారి చిరుత కనిపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ (Sri Venkateswara University Campus)లో మంగళవారం రాత్రి చిరుత కనిపించింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద నాటుకోళ్ల షెడ్‌పై రాత్రి సమయంలో చిరుత (Leopard) దాడి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దీంతో అధికారులు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్ రోడ్లపై ప్రయాణాలను నిషేధించారు. కాగా యూనివర్సిటీలో తరచూ చిరుత సంచారిస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురి అవుతున్నారు. గతంలో సైతం పలుమార్లు విద్యార్థుల హాస్టల్, క్యాంపస్ ఆవరణలో చిరుత కనిపించింది. యూనివర్సిటీ పరిసరాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నట్లు సమచారం. తాజాగా చిరుత సంచారంతో అటవీ శాఖ అధికారులు (Forest Department Officers) అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా చిరుత కోసం గతంలోనే అధికారులు ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. అయినా అది దొరకకుండా తిరుగుతోంది.
Tirupati | గతంలో మెట్ల మార్గంలో
శ్రీవారి మెట్ల మార్గంలో అక్టోబర్ 31న ఉదయం చిరుత కనిపించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు (Devotees) చూశారు. చిరుతను చూసి భయంతో భక్తులు కేకలు వేశారు. దీంతో అది సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో అధికారులు భక్తులను గుంపులుగా మెట్ల మార్గంలో పంపించారు. గతంలో సైతం పలుమార్లు మెట్ల మార్గం, ఘాట్ రోడ్డులో, ఎస్వీ యూనివర్సీటీ ప్రాంగణాల్లో చిరుతలు సంచరించాయి. దీంతో భక్తులతో పాటు, యూనివర్సిటీ విద్యార్థులు భయ పడుతున్నారు. చిరుతలను పట్టుకొని అడవిలో వదిలి పెట్టాలని కోరుతున్నారు.