అక్షరటుడే, వెబ్డెస్క్ : Srisailam | శ్రీశైలానికి సమీపంలోని చిన్నారుట్ల చెంచుగూడె గ్రామంలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిపై చిరుతపులి దాడి చేసి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. తల్లిదండ్రులు, గ్రామస్థుల ధైర్యసాహసంతో ఆమె ప్రాణాలు రక్షించారు. చిన్నారి తల, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. చెంచుగూడె గ్రామానికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతులు, తమ మూడేళ్ల కుమార్తె అంజమ్మతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ చిరుతపులి (Leopard) ఇంట్లోకి చొరబడి, పక్కన నిద్రిస్తున్న చిన్నారి తలపై పంజా వేసి నోటకరచుకుని బయటకు ఈడ్చుకెళ్లేందుకు యత్నించింది.
Srisailam | చిరుత దాడి..
అంజమ్మ ఏడుపు విని తల్లిదండ్రులు ఒక్కసారిగా లేచి చూసేసరికి చిరుత చిన్నారిని లాక్కెళుతుంది. గమనించిన వెంటనే ధైర్యంగా స్పందించిన వారు కర్రలు పట్టుకుని చిరుతను వెంబడించారు. గ్రామస్థులు కూడా అరవడంతో భయపడిన చిరుత పాపను పొదల్లో వదిలేసి అడవిలోకి పారిపోయింది. దాడిలో చిన్నారి తల, పొట్టకు గాయాలవడంతో, కుటుంబ సభ్యులు ఆమెను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి (Dornala Government Hospital) తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ దాడితో గ్రామస్థులలో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. గ్రామానికి విద్యుత్ సదుపాయం లేకపోవడమే వన్యప్రాణుల దాడులకు కారణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దోర్నాల – శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న అటవీ మరియు పోలీసు శాఖ అధికారులు (Police Department Officers) ఘటనాస్థలికి చేరుకుని, గ్రామస్థులతో చర్చలు జరిపారు. గ్రామానికి త్వరితగతిన విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇవ్వడంతో, ఆందోళన విరమించారు. అయితే ప్రాణాపాయ పరిస్థితుల్లో గ్రామస్థుల చొరవ, ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే వన్యప్రాణుల నుండి గ్రామాలను రక్షించేందుకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.