Homeబిజినెస్​Lenskart | రూ.2,150 కోట్ల ఐపీవో కోసం ప్రాస్పెక్టస్ సమర్పించిన లెన్స్‌కార్ట్

Lenskart | రూ.2,150 కోట్ల ఐపీవో కోసం ప్రాస్పెక్టస్ సమర్పించిన లెన్స్‌కార్ట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lenskart  | ఫ్యాషనబుల్ ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు, సన్‌గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సులు మొదలైనవి విక్రయించే దిగ్గజ ఐవేర్ రిటైలింగ్ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (Lenskart Solutions Limited) తమ ఐపీవోకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.

దీని ప్రకారం ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, నిర్దిష్ట షేర్‌హోల్డర్లు 13,22,88,941 వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. వీరిలో ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన పీయుష్ బన్సల్, నేహా బన్సాల్, అమిత్ చౌదరి, సుమీత్ కపాహీతో పాటు ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన ఎస్‌వీఎఫ్ II లైట్‌బల్బ్ (కేమ్యాన్), ష్రోడర్స్ క్యాపిటల్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా మారిషస్ లిమిటెడ్, పీఐ ఆపర్చూనిటీస్ ఫండ్ – II, మ్యాక్‌రిచీ ఇన్వెస్ట్‌మెంట్స్, కేదారా క్యాపిటల్ ఫండ్ II, ఆల్ఫా వేవ్ వెంచర్స్ ఉన్నాయి. ఆర్‌హెచ్‌పీని దాఖలు చేయడానికి ముందు కంపెనీ రూ. 430 కోట్ల ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ (pre-IPO placement) చేపట్టే అవకాశం ఉంది.

ఐపీవో ద్వారా నికరంగా సమీకరించిన నిధులను భారత్‌లో కొత్త కంపెనీ-ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ (సీవోసీవో) స్టోర్స్ (Company-Operated Company Owned stores) (COCO) ఏర్పాటుకు సంబంధించి మూలధన వ్యయాలకు, ఈ సీవోసీవో స్టోర్స్ లీజు, రెంటు, లైసెన్స్ అగ్రిమెంట్లకు సంబంధించిన చెల్లింపులు చెల్లించేందుకు, టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాపై పెట్టుబడులు పెట్టేందుకు, బ్రాండ్ మార్కెటింగ్, బిజినెస్ ప్రమోషన్‌కు, ఇనార్గనిక్ కొనుగోళ్లకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకుంటుంది.

2008లో ఏర్పాటైన లెన్స్‌కార్ట్, 2010లో ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించింది. 2013లో న్యూఢిల్లీలో తొలి రిటైల్ స్టోర్ ప్రారంభించింది. ప్రస్తుతం దేశీయంగా మెట్రో, ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. రాజస్తాన్‌లోని భివాడి, హర్యానాలోని గురుగ్రామ్‌లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అలాగే సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ప్రాంతీయ యూనిట్లు ఉన్నాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్రాండ్ల వ్యాప్తంగా కంపెనీ 105 కొత్తగా రూపొందించిన కలెక్షన్లను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. దేశవిదేశాలలో 1.241 కోట్ల కస్టమర్ ఖాతాలవ్యాప్తంగా 2.72 కోట్ల ఐవేర్ యూనిట్లను విక్రయించింది.