అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | స్థానిక సం”గ్రామానికి” తెర లేచింది. అక్టోబర్ 9 నుంచి పల్లెల్లో పోరు మొదలుకానుంది. దాదాపు 20 నెలల తర్వాత రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించాయి. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు(ZPTC Elections) పార్టీ గుర్తుల ఆధారంగా జరుగనున్న తరుణంలో ఎలాగైనా తమ పట్టు నిరూపించుకోవాలన్న భావనతో పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లెల్లో పాగా వేయాలనే లక్ష్యంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. నియోజకవర్గాలు, మండలాల వారీగా ముఖ్య నాయకులు బాధ్యతలు అప్పగించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ఫోకస్ చేశాయి.
Local Body Elections | విడుదలైన షెడ్యూల్..
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్థానిక పోరుకు షెడ్యూల్ వెలువడింది. మండల, జిల్లా పరిషత్‌లతో పాటు పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి అక్టోబరు 23, 27 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు, సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి మూడు దశల్లో అక్టోబరు 31, నవంబరు 4, 8వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు(MPTC Elections) పార్టీ గుర్తులతో, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయిలో బలంగా ఉంటేనే రాజకీయ మనుగడ సాధ్యం కాబట్టే ప్రధాన పార్టీలు స్థానిక సంస్థలను సీరియస్‌గా పరిగణిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లెల్లో పాగా వేయాలనే లక్ష్యంతో సన్నాహాలు చేసుకుంటున్నాయి.
Local Body Elections | కాంగ్రెస్‌కు అగ్ని పరీక్షే..
దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కఠిన పరీక్షగా మారాయి. పరిషత్, పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వ పనితీరును ప్రతిబింబించనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ స్థానిక ఎన్నికల(Local Body Elections)పై సీరియస్‌గా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో మెజార్టీ పల్లెలను దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించింది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే సర్పంచులు, ఎంపీటీసీలు ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే అధికార పార్టీ స్థానిక ఎన్నికలకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. అధికారంలో ఉండడం కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి అనుకూలంగా మారుతుందన్న భావన నెలకొంది.
Local Body Elections | బీఆర్ఎస్‌కు సవాలే..
ఉద్యమ పార్టీగా పాతికేళ్లు, అధికారంలో పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ(BRS Party) భవితవ్యాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించనున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ ప్రాభవాన్ని కోల్పోయింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు తోడు కీలక నేతలు వెళ్లిపోవడం ఉద్యమ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. ఇక, ప్రధానంగా కవిత రూపంలో పార్టీ అధినేత కేసీఆర్ ఇంట్లోనే మొదలైన ముసలం బీఆర్ఎస్‌ను తీవ్ర చిక్కుల్లో పడేసింది. అదే సమయంలో బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం శ్రేణులను గందగరగోళం రేకెత్తించింది. అటు అధికారం దూరమై, ఇటు బలం కోల్పోయి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైన తరుణంలో గులాబీ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంతో కీలకంగా మారాయి. మెజార్టీ స్థానాలు సాధించి తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పల్లె పోరుకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. వరుస సమావేశాలతో ముఖ్య నేతలు, కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నికలకు తాము సిద్ధమని, తమ సత్తా చాటుతామని ఆయన తాజాగా ప్రకటించారు. స్థానిక సంగ్రామంలో గెలుపు సాధించాలనే లక్ష్యంతో నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
Local Body Elections | బీజేపీ సన్నాహాలు..
ఇక, రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ(Bharatiya Jnatha Party)కి స్థానిక సంస్థల ఎన్నికలకు సవాలుగా మారాయి. పల్లెల్లో పాగా వేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటేనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న భావనతో బీజేపీ స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్న తరుణంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని కాషాయ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. విజయావకాశాలు, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాలపై దృష్టి సారించింది. ఎన్నికలకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో తాము విజయ పతాక ఎగురవేయడానికి బీజేపీ సన్నాహాలు చేసుకుంటోంది.