అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma house | నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma Housing Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. అర్హులైన వారికే ఇళ్లు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా గ్రామాల్లో అర్హులకు కాకుండా.. అనర్హులకు కూడా ఇళ్లు వచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో లంచం ఇవ్వకపోవడంతో తమకు ఇల్లు ఇవ్వలేదని ఓ కుటుంబం వాపోయింది.
మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన గుగ్గిళ్ల శ్రీదేవి కుటుంబానికి ఇల్లు లేదు. దీంతో కాంగ్రెస్ నాయకులను కలిసి ఇల్లు మంజూరు చేయాలని అడిగితే తనను అవమానించారని ఆమె రోదిస్తూ చెప్పింది. ‘‘కర్రె మొహందాన.. నువ్వేమన్న పైసలిచ్చినవా.. ఇందిరమ్మ ఇల్లు లేదు ఏమీ లేదంటూ” తనను అవమానించారని బాధిత మాహిళ వాపోయింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకన్న తనను దూషించినట్లు ఆమె చెప్పింది. తమకు ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరింది.