అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) తీస్ హజారీ కోర్టు (Tis Hazari Court) విచారణ సమయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితుడైన డాక్టర్ కోర్టు హాలులో బియ్యం చల్లడం, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బందిని ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది.
ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి డాక్టర్‌కు రూ. 2,000 జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే, డాక్టర్ చందర్ విభాస్ అనే సర్జన్ 2011నాటి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Delhi | భయపెట్టించాడు..
ఆగస్టు 11న అదనపు సెషన్స్ జడ్జి షెఫాలీ బర్నాలా టాండన్ (Judge Shefali Barnala Tandon) ముందు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో, డాక్టర్ కోర్టు నేలపై బియ్యం చల్లడం మొదలుపెట్టారు. ఈ చర్యని చేతబడిగా అనుమానం వ్యక్తం చేయడంతో, విచారణ నిలిచిపోయింది. ఈ చర్యతో న్యాయవాదులు జడ్జి బల్ల వద్దకు వెళ్లేందుకు నిరాకరించడంతో, కోర్టు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 20 నిమిషాల పాటు కోర్టు వాతావరణం గందరగోళంగా మారింది. వెంటనే స్పందించిన జడ్జి డాక్టర్‌ను ప్రశ్నించగా, తాను తినే సమయంలో బియ్యం కింద పడిపోయిందని సమాధానం ఇచ్చారు. అయితే, కోర్టుకు బియ్యం ఎందుకు తెచ్చారన్న ప్రశ్నకు సమాధానం లేదు.
జడ్జి ఈ చర్యను కోర్టు గౌరవాన్ని తక్కువ చేస్తూ, ఉద్దేశపూర్వకంగా కార్యకలాపాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. సెక్యూరిటీ సిబ్బంది బియ్యం తొలగించడానికి 15–20 నిమిషాలు పట్టింది. గతంలోనూ (ఆగస్టు 2న) ఇలాంటే ఘటన జరిగినట్లు కోర్టు సిబ్బంది గుర్తు చేయగా, వీడియో కాన్ఫరెన్స్‌లోనే పాల్గొన్నానని డాక్టర్ (Doctor) చెప్పారు. అయితే కోర్టు రికార్డులు ఆయన భౌతికంగా హాజరైనట్టు స్పష్టం చేశాయి. తన తప్పును అంగీకరించిన డాక్టర్ కోర్టు ఎదుట క్షమాపణ కోరారు. ఎవరో తనను తప్పుదారి పట్టించారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాదని హామీ ఇవ్వడంతో, కోర్టు ఆయనకి రూ. 2,000 జరిమానా విధించింది.