అక్షరటుడే, కామారెడ్డి: TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ (Ponnam Ashok Goud) అన్నారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో (Congress party Kamareddy) సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి లీగల్ సెల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటుందన్నారు. న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్తిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ ఛైర్మన్ దేవరాజ్ గౌడ్ న్యాయవాద సమస్యలను అశోక్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.
న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జ్యుడీషియల్ కమిటీ (Judicial Committee) ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల మెడిక్లయిమ్ను (Lawyers’ Mediclaim) రూ.2లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని, 41-A సీఆర్పీసీని వెంటనే రద్దు చేయాలని, కామారెడ్డి జిల్లాలో శాశ్వత కోర్టు భవనాన్ని అతి త్వరలో రూ.50 కోట్లతో నూతన భవనం నిర్మించాలని కోరారు.
ఈ సమస్యలను ప్రభుత్వానికి తెలిపి న్యాయవాదుల సమస్యలు తీర్చాలని విన్నవించారు. స్పందించిన అశోక్ గౌడ్ ఈ సమస్యలను వెంటనే సీఎం (CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా జిల్లా న్యాయవాదులను సీఎంతో కలిసేవిధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు (Kailas Srinivas Rao), జిల్లా గ్రంథాలయం సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జి ముబిన్, పీసీసీ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ ఉమా శంకర్, వెంకటేశ్వర్ రెడ్డి, బార్ అసోసియేషన్ (Bar Association) అధ్యక్షుడు నంద రమేష్, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, శ్యాం గోపాల్ రావు, నర్సింహారెడ్డి, సిద్దిరాములు, జడల రజనీకాంత్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ లీగల్ సెల్ అధ్యక్షులు, నాలుగు జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.