అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | హైదరాబాద్(Hyderabad) నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. వారం రోజుల్లో నగరంలో రెండు షాకింగ్ ఘటనలు జరిగాయన్నారు.
నగరంలోని చందానగర్లో ఇటీవల ఖజానా జ్యువెల్లరీ షోరూం(Khajana Jewellery Showroom)లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దుకాణం తెరిచిన ఐదు నిమిషాలకు ఆరుగురు దొంగలు తుపాకులతో లోనికి చొరబడి దోపిడీ చేశారు. వెండి, బంగారు ఆభరణాలతో పారిపోయారు. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. దోపిడీకి పాల్పడిన ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కూకట్పల్లిలో ఇటీవల 12 ఏళ్ల బాలిక హత్య జరిగింది. ఈ ఘటనలపై కేటీఆర్(KTR) స్పందించారు.
KTR | వారం రోజుల్లో రెండు ఘటనలు
నగరంలో వారం రోజుల వ్యవధిలో రెండు ఘటనలు చోటు చేసుకోవడంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జ్యువెలరీ షాపులో గన్‌తో బెదిరించి దోపిడీ చేశారన్నారు. ఉదయం పూట గన్లతో బెదిరించి దోపిడీకి పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలతో నగర ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR | ప్రజల భద్రతకు ముప్పు
కాంగ్రెస్ పాలనలో ప్రజల భద్రతకు ముప్పు ఉందని కేటీఆర్ విమర్శించారు. శాంతిభద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆయన ఆరోపించారు. పౌరులకు భద్రత కావాలి.. భయం కాదని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.