అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DGP Shivdhar Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని నూతన డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలు, మాదవ ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారిస్తామని చెప్పారు. నూతన డీజీపీగా నియమితులైన శివధర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేస్తామని చెప్పారు. తమకు బలమైన జట్టు ఉందని, ఎలాంటి పరిస్థితులు, సవాళ్లు ఎదురైనా కష్టపడి పని చేస్తామన్నారు. డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
DGP Shivdhar Reddy | ప్రశాంతంగా ఎన్నికలు..
డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తనకు తొలి సవాల్ స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) రూపంలో ఎదురవుతుందని శివధర్‌రెడ్డి తెలిపారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుంటామని, తమ సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. బేసిక్ పోలీసింగ్‌తో సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామన్నారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని.. ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు.
DGP Shivdhar Reddy | మావో సిద్ధాంతాలు విఫలం..
మావోయిస్టు సిద్ధాంతాలు ఆచరణలో విఫలమయ్యాయని డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivdhar Reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే మావోయిస్టుల్లో పునరాలోచన మొదలైందన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. నక్సలైట్లు అడవిని వీడి బయటకు రావడానికి, ఆయుధాలు వదిలి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామంటూ ప్రకటనలో తెలిపారన్నారు. జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నపుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారని చెప్పారు. వేణుగోపాల్ ఇచిన స్టేట్‌మెంట్‌ను జగన్ ఖండించారని.. ప్రజా పోరాట పంథా సక్సెస్ అవల్లేదని మావోయిస్టులే అంటున్నారన్నారు.
DGP Shivdhar Reddy | చర్చలు అవసరం లేదు..
మావోయిస్టుల(Maoists) సిద్ధాంతాలు విఫలమైన తరుణంలో పోరాటాన్ని ఆపి జన జీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు. పోలీసులు వేధిస్తారని భయం లేకుండా ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వస్తున్నారని.. ఇటీవల సెంట్రల్ కమిటీ మెంబర్ కవితక్క కూడా లొంగిపోయారన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. మావోయిస్టులతో తమకు ఇక్కడ సమస్య లేనప్పుడు వాళ్లతో చర్చలు అనవసరమని చెప్పారు.
DGP Shivdhar Reddy | పింక్ బుక్ తెలియదు..
రాష్ట్రంలో పోలీసు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ చెబుతున్న పింక్ బుక్ పై డీజీపీ పరోక్షంగా స్పందించారు. తమకు పింక్ బుక్ అంటే ఏమిటో తెలియదని, తమకు ఖాకీ బుక్ మాత్రమే తెలుసని చెప్పారు. ‘మాకు ఉన్నదంతా ఖాకీ బుక్.. మాకు పింక్ బుక్ గురించి తెలియదు. ఇతరుల వ్యక్తిత్వ హనానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటాం’ అంటూ నూతన డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు.సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. బేసిక్ పోలీసింగ్ & విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో పోలీసుస్టేషన్ల సంఖ్య పెంచడానికి బదులు పోలీసుల్లో నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.