అక్షరటుడే, కామారెడ్డి: Tribal Girls Hostel | ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో (government tribal girls’ hostel) శుక్రవారం అర్ధరాత్రి దుండుగు చొరబడి చోరీకి పాల్పడ్డాడు. దీంతో విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు.
హాస్టల్లో ఉన్న డిగ్రీ విద్యార్థులకు చెందిన నాలుగు మొబైల్స్ చోరీకి గురయ్యాయి. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో విద్యార్థులు భయపడ్డారు. ఈ మేరకు శనివారం ఉదయం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో (Kamareddy town police station) విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ.. చోరీ విషయంలో సిబ్బంది హస్తం ఉందని ఆరోపించారు. వాచ్‌మెన్‌కు ఫోన్‌చేస్తే హాస్టల్లోనే ఉండి కూడా లేనట్లుగా మాట్లాడాడని విద్యార్థులు ఆరోపించారు.
హాస్టల్లోకి (Hostel) వచ్చిన వ్యక్తి ఒక గదిలో రెండు ఫోన్లు తీసుకున్నప్పుడు తాము గమనించి అరిస్తే గదికి గొళ్లెంపెట్టి ఇతర గదిలో మరొక రెండు ఫోన్లు చోరీ చేసి పారిపోయాడన్నారు. హాస్టల్లో ఉన్న నిచ్చెన రాత్రి కనిపించలేదని, ఈ విషయం వాచ్‌మన్‌ను అడిగితే మేడమ్ తీసేయ్యమన్నారని చెప్పారని, వార్డెన్‌కు ఫోన్ చేసి అడుగుతామంటే తానే తీసేశానని చెప్పాడని తెలిపారు.
దీపావళికి ముందు కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చారని భయంతో ఈ విషయాన్ని తాము బయటకు చెప్పలేకపోయామన్నారు. మెనూ కూడా సరిగా పాటించడం లేదని, రెండు నెలలుగా పప్పుతోనే భోజనం పెడుతున్నారన్నారు. తినేటప్పుడు కూడా సిబ్బంది తమపై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం, కల్లు తాగి సిబ్బంది పని చేస్తారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు.
Tribal Girls Hostel | విద్యార్థులకు రక్షణ లేదు: విద్యార్థి సంఘాలు
హాస్టల్లో విద్యార్థులకు రక్షణ లేదని విద్యార్థి సంఘాలు (Student unions) ఆరోపించాయి. చోరీ ఘటన విషయంలో హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడిన విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హాస్టల్ పర్యవేక్షణపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హాస్టల్లో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి ఒంటి గంటకు తెలియని వ్యక్తి వస్తే రక్షణ ఎలా ఉందో తెలుస్తుందన్నారు.
దీనిపై ఎంక్వైరీ కమిషన్ (inquiry commission) వేసి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై హాస్టల్ వార్డెన్ వివరణ కోరగా హాస్టల్లో ఎలాంటి సమస్యలు లేవన్నారు. విద్యార్థులు తన దృష్టికి ఏ సమస్య కూడా తీసుకురాలేదన్నారు. మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులు తనపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
![]()
