Homeజిల్లాలుకామారెడ్డిOperation Tiger | ఆపరేషన్​ టైగర్​

Operation Tiger | ఆపరేషన్​ టైగర్​

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Operation Tiger | కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేవుతోంది. రెండు రోజులుగా అటవీశాఖ అధికారులు పెద్ద పులి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ (rescue operation) చేపడుతున్నారు. డ్రోన్లు, ట్రాక్ కెమెరాలతో పులి జాడ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులిపై విషప్రయోగం జరిగిందన్న ప్రచారం అటవీశాఖ అధికారులను (forest officials) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పులి బతికే ఉందా.. చనిపోయిందా అనే అనుమానాలు అటవీశాఖ అధికారులను వెంటాడుతున్నాయి. పులి జాడ తెలిస్తే తప్ప అధికారులకు కంటిమీద కునుకు ఉండే అవకాశాలు లేవన్న ప్రచారం సాగుతోంది.

పెద్దపులి సంచారం విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆదివారం ఉదయం నుంచి అడవిలో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. సిరికొండ, ఇందల్వాయి, కామారెడ్డి నుంచి మూడు బృందాలు పులికోసం అడవిని జల్లెడ పడుతున్నారు. అడవిలో ఆరు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రెండు డ్రోన్ కెమెరాలతో అడవి మొత్తం గాలిస్తున్నారు.

Operation Tiger | పులిపై విషప్రయోగం..?

రెడ్డిపేట తండాకు చెందిన మహిపాల్ అనే వ్యక్తి చెందిన ఆవుపై శనివారం సాయంత్రం పెద్దపులి దాడి చేసింది. దీంతో అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఆదివారం ఉదయమే తండా ప్రాంతంలో పులి పాదముద్రలు (tiger footprints) సేకరించి పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఆవుపై ఈగలు వాలి చనిపోవడంతో అనుమానం వచ్చి వైద్యుడితో పరీక్ష చేయించగా గుర్తు తెలియని మందు ఆవుపై చల్లినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ మహిపాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆవుపై గడ్డి మందు చల్లినట్లుగా ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. మహిపాల్​తో పాటు అతనికి సహకరించిన సంజీవులు, గోపాల్ అనే మరో ఇద్దరిని సైతం అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆవుపై పులి మళ్లీ దాడి చేసిందా.. లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒకవేళ ఆవుపై మళ్లీ దాడి చేస్తే విషప్రయోగం జరిగే అవకాశాలు ఉన్నాయి.

Operation Tiger | చనిపోయిందా.. శివారు దాటిందా..?

పెద్ద పులి (Big Tiger) సంచరించిన ప్రాంతం మాచారెడ్డి రేంజ్ ఎల్లంపేట ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే పులిపై విషప్రయోగం జరిగిందనే ప్రచారంతో అసలు పులి బతికే ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆవుపై పులి మరోసారి దాడి చేయకపోతే జిల్లా శివారు దాటి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. శివారు దాటితే మాత్రం అధికారులు ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి.

Operation Tiger | భయంగా గడుపుతున్నాం

మా ఇల్లు అడవికి ఆనుకుని ఉంటుంది. రెండు రోజులుగా పులి సంచారంతో భయంగా గడుపుతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లలేక పోతున్నాం. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. అధికారులు స్పందించి పులిని పట్టుకోవాలి.

Operation Tiger | మేకల కాపలా వెళ్లడం లేదు

ప్రతిరోజూ అడవిలోకి మేకలు, ఆవులు మేపడానికి వెళతాం. రెండు రోజుల నుంచి వెళ్లాలంటే పులి ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతున్నాం. ఇప్పటికే రెండు ఆవులను చంపింది. తండాకు దగ్గర వరకు పులి వచ్చింది. ఇళ్లపైకి వస్తే మా పరిస్థితి ఏంటి.. అధికారులు రెండు రోజుల నుంచి పులికోసం వెతుకుతున్నారు. త్వరగా పులి జాడ తెలుసుకోవాలి.

Operation Tiger | రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది

పెద్దపులి ఆవుపై దాడి చేసిందని సమాచారం రాగానే మా అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వారం రోజుల క్రితమే సిరికొండ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా పాదముద్రలు బయటపడడంతో అన్ని ఏరియా అధికారులను అప్రమత్తం చేశాం. ప్రస్తుతం మూడు బృందాలు పెద్దపులి కోసం వెతుకుతున్నాయి. ఇప్పటికే పులిని గుర్తించేందుకు ఆరు ట్రాక్ కెమెరాలను అమర్చాం. రెండు డ్రోన్ కెమెరాలతో సెర్చ్ చేస్తున్నాం. పులిపై విషప్రయోగం జరిగిందనేది స్పష్టంగా చెప్పలేం. ఆవుపై మందు చల్లానని మహిపాల్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. శాంపిల్ సేకరించి ఫోరెన్సిక్ కు పంపించాం. పులికి ఏమి జరిగి ఉండదని భావిస్తున్నాం. గత 40-50 ఏళ్లుగా జిల్లాలో పెద్దపులి సంచారం లేదు. చిరుతలు, ఎలుగుబంట్లు మాత్రమే ఉన్నాయి. పెద్దపులి వస్తే దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రజలెవరూ అడవి వైపు వెళ్లొద్దని సమాచారం తెలియజేశాం. పులి కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలి.