అక్షరటుడే, వెబ్డెస్క్ : Land Scam | మహారాష్ట్ర రాజకీయాలను భూ కుంభకోణాల ఆరోపణలు కుదిపేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) కుమారుడు రూ.1,800 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు దక్కించుకున్నాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరో మంత్రి సైతం రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకే దక్కించుకున్నాడని కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) ఆరోపించారు.
రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ (State Minister Pratap Sarnaik) రూ.3 కోట్లకే రూ.200 కోట్ల విలువైన భూమిని దక్కించుకున్నట్లు కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు ఎకరాల భూమిని మంత్రి రూ.3 కోట్లకే కొనుగోలు చేశారన్నారు. కానీ సదరు భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఆ భూమిలో మంత్రి విద్యాసంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. దీనిపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్ బవాంకులే మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Land Scam | అజిత్ పవార్ కుమారుడిపై..
అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ (Parth Pawar)కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.18 వందల కోట్ల విలువైన భూమిని రూ.300 కోట్లకే విక్రయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ భూ కుంభకోణంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (Inspector General of Registration) రూ.1,800 కోట్ల ఆస్తి లావాదేవీలో జరిగిన తీవ్రమైన అవకతవకలను వివరిస్తూ మధ్యంతర నివేదికను సమర్పించింది. ముంబైలోని అదనపు ప్రధాన కార్యదర్శికి పంపిన నివేదిక, పూణేలోని ముంధ్వా ప్రాంతంలో ప్రభుత్వ-సంబంధిత భూమి అమ్మకం, రిజిస్ట్రేషన్‌లో లోపాలు జరిగినట్లు పేర్కొంది. దీంతో ఓ అధికారిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.
