అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kokapet Lands | రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో నగరంలోని పలు భూములకు ఆన్లైన్ వేలం (online auction) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేలం పాట శుక్రవారంతో ముగిసింది. మొత్తం నాలుగు దశల్లో వేలం పాట జరగ్గా ప్రభుత్వానికి రూ.3,862.8 కోట్ల ఆదాయం సమకూరింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని నియోపాలిస్ భూములకు (Neopolis lands) ప్రభుత్వం మూడు విడుతల్లో వేలం నిర్వహించింది. తాజాగా శుక్రవారం గోల్డ్ మైల్ భూములను (Gold Mile lands) వేలం వేసింది. 1.98 ఎకరాలను COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. ఆ కంపెనీ ఎకరానికి రూ.77.75 కోట్లకు పాడింది. దీంతో రూ.154 కోట్ల ఆదాయం వచ్చింది.
Kokapet Lands | హాట్‌కేకుల్లా..
కోకాపేట భూములు (Kokapet Lands) హాట్ కేక్‌ల్లా అమ్ముడు పోతున్నాయి. కోట్లు పెట్టి ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మొదటి విడతలో నవంబర్ 24న ప్లాట్ నంబర్ 17, 18లోని భూములకు ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. 18లో 5.31 ఎకరాల భూమి ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు 1,355.33 కోట్లు ధర పలికింది.
నవంబర్ 28న రెండో దశ వేలం నిర్వహించారు. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు జీహెచ్ఆర్ సంస్థ దక్కించుకుంది. 16వ ఎకరాకు రూ.147.75 కోట్లకు చొప్పున గోద్రెజ్ సంస్థ కొనుగోలు చేసింది. మూడో విడత డిసెంబర్ 3న జరిగింది. ప్లాట్ నెంబర్ 19లో ఎకరా రూ.131 కోట్ల చొప్పున యులా కన్స్ట్రక్షన్స్ & గ్లోబస్ ఇన్‌ఫ్రాకాన్ దక్కించుకుంది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరా రూ.118 కోట్ల చొప్పున బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ (Brigade Enterprises) వేలం పాడింది.
Kokapet Lands | మూసాపేటలో వాయిదా
మూసాపేటలోని వై జంక్షన్ (Y junction in Moosapet) సమీపంలో 15 ఎకరాలకు శుక్రవారం వేలం జరగాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు గతంలో వివరాలు వెల్లడించారు. ప్లాట్ నంబర్ 1లో 11.48 ఎకరాలు, ప్లాట్ నంబర్ 2లో 3.18 ఎకరాలకు ఆన్లైన్ ఆక్షన్ నిర్వహిస్తామని చెప్పారు. పరిపాలన కారణాలతో ఈ వేలం ప్రక్రియను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు.
