అక్షరటుడే, ఇందూరు : Nizamabad | జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ(Land Acquisition) ప్రక్రియ నెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దసరాకు ముందే అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని సీఎం పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), డీఎప్వో వికాస్ మీనా, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.