Homeబిజినెస్​Lalitha Jewellery IPO | ఐపీవోకు లలితా జువెల్లరీ!

Lalitha Jewellery IPO | ఐపీవోకు లలితా జువెల్లరీ!

లలితా జువెల్లరీ సంస్థ త్వరలో ఐపీవోకు రానుంది. ఈ మేరకు సెబీ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో త్వరలోనే స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lalitha Jewellery IPO | ప్రజాదరణ పొందిన జువెల్లరీ సంస్థల్లో ఒకటైన లలితా జువెల్లరీ ఐపీవోకు వస్తోంది. ఇటీవల సెబీ అనుమతులు లభించడంతో త్వరలోనే స్టాక్‌ మార్కెట్‌ (Stock Market)లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. దీనిపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.

1985లో చెన్నై టి. నగర్‌(T. Nagar)లో లలితా జువెల్లరీ మొదటి స్టోర్‌ను ప్రారంభించారు. ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న ప్రకటనతో జనంలోకి చొచ్చుకువెళ్లింది. ప్రమోటర్‌ కిరణ్‌ కుమార్‌(Promoter Kiran Kumar) స్వయంగా ఈ యాడ్‌లో నటించి, విస్తృతంగా ప్రమోట్‌ చేశారు. తమ దగ్గర మేకింగ్‌ చార్జీలు తక్కువగా ఉంటాయని.. వేరే సంస్థలతో ధరలను పోల్చి చూసుకున్న తర్వాతే తమ వద్దకు వచ్చి కొనుగోలు చేయాలని సూచించారు. దీంతో ఈ స్టోర్లకు ఆదరణ పెరిగింది. లలితా జువెల్లరీస్‌ (Lalitha Jewellers) అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా 56 స్టోర్ల(Stores)ను కలిగి ఉంది. చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న లలితా జువెల్లరీ కంపెనీ.. పబ్లిక్‌ ఇష్యూ(Public issue)కు రావాలని నిర్ణయించుకుంది.

దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకు ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఐపీవో(IPO) ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 1,200 కోట్లు ఫ్రెష్‌ ఇష్యూ కాగా.. మిగిలినది ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్‌ కిరణ్‌ కుమార్‌ తన వాటాను విక్రయించనున్నారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లోనుంచి రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్ల ఏర్పాటు కోసం, మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. కంపెనీ దాఖలు చేసిన ముసాయిదా(Draft)ను ఇటీవల సెబీ ఆమోదించింది. దీంతో త్వరలోనే ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌(Subscription) కోసం రానుంది. అయితే ఎప్పటినుంచి అన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ కంపెనీ ఐపీవోకు ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఐపీవో వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.