IPL 2025 | రింకూ సింగ్‌ను చెంప దెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్ (వీడియో)
IPL 2025 | రింకూ సింగ్‌ను చెంప దెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్ (వీడియో)

అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), కో‌ల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) మ్యాచ్ అనంతరం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ సెన్సేషన్ రింకూ సింగ్‌(Rinku Singh)ను.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) చెంప దెబ్బ కొట్టాడు. దాంతో రింకూ సింగ్ ఒక్కసారిగా తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌ను మార్చాడు. అయినా ఏదో చెబుతూ కుల్దీప్ యాదవ్ మరోసారి చెంపపై కొట్టాడు. కుల్దీప్ యాదవ్ తీరుపై రింకూ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IPL 2025 | అసలేం జరిగిదంటే..

ఈ మ్యాచ్‌లో కేకేఆర్(KKR) 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్ నవ్వుతూ ఏదో విషయం గురించి చర్చించుకున్నారు. ఇంతలోనే కుల్దీప్ యాదవ్.. రింకూ సింగ్‌ చెంప చెళ్లుమనిపించాడు. ఈ అనూహ్య ఘటనతో రింకూ అవాక్కయ్యాడు. కాస్త కోపంగా లుక్ ఇచ్చాడు. అయినా వెనక్కి తగ్గని కుల్దీప్ యాదవ్.. ఏదో విషయం చెబుతూ మరో చెంప దెబ్బ కొట్టాడు. కుల్దీప్ యాదవ్‌పై రింకూ సీరియస్ కావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) తేలిపోయాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ తీయకుండా 27 పరుగులు ఇచ్చాడు. అయితే ఇందులో రింకూ సింగ్ ఒక్కడే 22 రన్స్ చేశాడు. ఆ విషయంలోనే హర్ట్ అయిన కుల్దీప్ యాదవ్.. రింకూ సింగ్‌(Rinku Singh)ను కొట్టినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కుల్దీప్ యాదవ్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. కుల్దీప్ యాదవ్‌పై రింకూ సింగ్ ఫిర్యాదు చేస్తే మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

IPL 2025 | రఫ్ఫాడించిన సునీల్ నరైన్..

ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్(KKR) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(Angkrish Raghuvanshi)(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), రింకూ సింగ్(Rinku Singh)(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్(Mitchell Stark)(3/43) మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్(Vipraj Nigam)(2/41), అక్షర్ పటేల్(Axar Patel)(2/27) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఫాఫ్ డుప్లెసిస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), అక్షర్ పటేల్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(Sunil Narine) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/39) రెండు వికెట్లు పడగొట్టాడు. అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా చెరో వికెట్ తీసారు.