HomeతెలంగాణHydraa | కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువుకు పూర్వవైభవం.. పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్​

Hydraa | కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువుకు పూర్వవైభవం.. పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్​

కూకట్​పల్లి నల్లచెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ పరిశీలించారు. చెరువును ఆహ్లాదకరంగా తయారు చేయాలని ఆయన సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువు (Kukatpally Nalla Cheruvu)కు హైడ్రా పూర్వ వైభవం తీసుకు వస్తోంది. ఈ చెరువు పరిధిలోని ఆక్రమణలను గతేడాది హైడ్రా తొలగించింది. అనంతరం అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నెలాఖరులోగా చెరువును సుందరంగా సిద్ధం చేయాలని హైడ్రా భావిస్తోంది.

నల్ల చెరువులో పూడికతీత పనులను గతంలో చేపట్టారు. ప్రస్తుతం వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండింది. చెరువు పరిసరాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదివారం ప‌రిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ (Walking track) ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రాక్​కు ఎక్క‌డా అంత‌రాయం లేకుండా చూడాల‌ని ఆయన సూచించారు. చెరువు కట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

Hydraa | ఆహ్లాదకరంగా..

నల్లచెరువు ఆక్రమణలకు గురై నిర్మాణ వ్య‌ర్థాల‌తో నిండి.. మురికి కూపంగా ఉండేది. హైడ్రా అధికారులు దాని పునరుద్ధరణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీంతో అది ప్రస్తుతం పూర్వ వైభవం సంతరించుకుంది. ఆరు నెలల్లో ఆహ్లాదకరంగా మారింది. హైడ్రా చర్యలతో చెరువు రూపు రేఖలు మారిపోయాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా మంది ప్రజలు అక్కడకు వచ్చి సేద తీరుతున్నారు. చెరువు పరిసరాల్లో చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్​ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశ్రాంతి మందిరాలు, కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

Hydraa | ఆక్రమణలు తొలగించి..

కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును గతంలో కొందరు ఆక్రమించారు. దీంతో 16 ఎకరాలకు కుచించుకుపోయింది. అయితే రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన స‌మాచారంతో హైడ్రా చెరువు విస్తరణ పనులు చేపట్టింది. ఆక్రమణలను తొలగించి ప్రస్తుతం 30 ఎకరాల్లో చెరువును అభివృద్ధి చేసింది. చెరువు పక్కన బతుకమ్మ ఆడేందుకు వీలుగా వేదికను సైతం ఏర్పాటు చేస్తున్నారు.