అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | పోలీసులు డ్యూటీ సక్రమంగా నిర్వర్తించకపోతే తాము పని చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేటలో సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తి సోదరుడు ప్రత్యర్థి ఇంటిపై ట్రాక్టర్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యశోద ఆసుపత్రి (Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న బాధితులను కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు, అతని భార్య గంజి భారతి పరామర్శించి, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
KTR | కేసులు నమోదు చేయాలి
బాలరాజు కుటుంబంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి ఒకరు చేశారని, అతడి వెనకాల నలుగురు ఉన్నారని చెప్పారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ అందరి వైద్య ఖర్చులను పార్టీ పరంగా తాము భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సైతం బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
KTR | పోలీసులు పట్టించుకోవడం లేదు
నల్గొండ జిల్లా (Nalgonda District)లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య యాదవ్‌ను కాంగ్రెస్ వారు హత్య చేశారన్నారు. సూర్యాపేటలో బీసీ సోదరుడి భార్య నామినేషన్ వేస్తే, అతడిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారన్నారు. ఇన్ని అరాచకాలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నామని.. పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే తామే డ్యూటీ చేస్తామన్నారు. దాడికి ప్రతిదాడి అనే పరిస్థితే వస్తే తిరగబడతామన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కార్యకర్తలను రెచ్చగొడితే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.పోలీసులకు జీతాలు ఇస్తున్నది రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో కాదని కేటీఆర్ అన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారని చెప్పారు. అదే ప్రజల ప్రాణాలు కాంగ్రెస్ గుండాలు తీస్తుంటే పోలీసులు చేతకాని వాళ్లలా చూస్తూ ఉండడం సరికాదన్నారు.