అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sridhar Babu | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గాలి మాటలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం – భూ పరివర్తన (industrial policy – land) విధానంపై కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 9,200 ఎకరాల భూములను కాజేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) పారిశ్రామిక విధానం – భూ పరివర్తన విధానం గురించి వక్రీకరణలు చేస్తున్నారని మండిపడ్డారు.
9,200 ఎకరాల్లో 4040 ఎకరాలు ప్లాట్ చేశామన్నారు. పరిశ్రమల యాజమాన్యంలోని ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన ఇంపాక్ట్ ఫీజును మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. భూమి మార్పిడి ద్వారా ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. భూమి ఉన్నవారు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కలిగి ఉంటారని తెలిపారు.
Sridhar Babu | బెదిరింపులకు పాల్పడుతున్నారు
కేటీఆర్ గాలి వాదనలు చేయడం మానేయాలని మంత్రి హితవు పలికారు. ఆయన చెప్పినట్లు 30 శాతం సంఖ్య భూమి విలువ కాదని, ఇది మార్పిడి రుసుము మాత్రమేనని స్పష్టం చేశారు. ఫ్రీహోల్డ్, లీజు భూములపై (freehold and leased lands) ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకదానికొకటి సంబంధం లేదన్నారు. లీజు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చడానికి జీవోలు జారీ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రాజకీయ మైలేజ్ కోసం భూమి విలువకు మార్పిడిని లింక్ చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా నిరోధించే బెదిరింపులకు దిగుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. నిజంగా పారిశ్రామిక భూమి అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కేటీఆర్ ప్రస్తావించిన పేర్లు ప్రభుత్వంలో భాగం కావని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్టుగా అడ్డగోలుగా తమ ప్రభుత్వం చేయడం లేదన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా చెల్లింపులు చేయడం లేదని పేర్కొన్నారుర. కేటీఆర్ ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన అన్నారు. పదేళ్లు మంత్రిగా అనుభవం ఉన్న కేటీఆర్ ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు కేటీఆర్ అబద్ధాలు చెప్పారని, అసత్యాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ నేతలు ముందుంటారని విమర్శించారు.
