అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరోక్షంగా స్పందించారు. జనగామలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉండడం సహజమని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణమని వ్యాఖ్యానించారు. అయితే ‘గొడవలు జరిగినప్పుడు అలుగుడు, గులుగుడు ఉంటాయి.. సర్దుకుపోవాలి..’ లేదంటే కాంగ్రెస్ నేతలకు సందు దొరుకుతుందని కేటీఆర్ అన్నారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శులు చేశారు. ఈ ముఖ్యమంత్రికి ఏం తెల్వదని.. నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి కేసీఆర్‌కే పాఠాలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. రైతుల పరిస్థితులు అగమ్యగోచరంగా తయారైందన్నారు. యూరియా కోసం పాత రోజుల్లా ఎదురు చూడాల్సిన దుస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారన్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాను అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను పసిగట్టాలని కేటీఆర్ కోరారు.