అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ : DCC Nizamabad | కాంగ్రెస్ నాయకులను దూషించే హక్కు కేటీఆర్‌కు (KTR) లేదని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
DCC Nizamabad | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం..
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించడమంటే ఆది కేటీఆర్ అవివేకానికి, అహంకారానికి నిదర్శనమని నగేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పథకాలు అమలు చేయడం లేదని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం, పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీల మేరకు అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందించడం జరిగిందన్నారు.
DCC Nizamabad | ఇందరిమ్మ ఇళ్లు..
ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేయడం జరిగిందని, దాదాపు రూ.22 వేల కోట్ల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని నగేష్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది ఎకరానికి రూ.12,000 రైతుబంధు ఇస్తున్నామని.. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇస్తున్నామని ఇలా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కేవలం ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రం, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.