అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR | ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ (former CM KCR) ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వెళ్లారు. వారు కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి సాగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారు. శనివారం ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Commission report) ప్రభుత్వం చర్చించనుంది. దీంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు చర్చించారు.
KCR | కాళేశ్వరం నివేదికపై..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు, మేడిగడ్డ కుంగిపోవడంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) జులై 31న నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కుంగడానికి కేసీఆర్ నిర్ణయాలే కారణమని కమిషన్ పేర్కొంది. దీంతో నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలో అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో (Erravalli Farmhouse) నేతలు చర్చించారు.
KCR | కేసీఆర్ సభకు వస్తారా
కాళేశ్వరం ప్రాజెక్ట్ తన మానస పుత్రిక అని కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. తానే దగ్గరుండి పనులు చేయించినట్లు పేర్కొన్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగడం, డిజైన్ మార్పు వంటి విషయంలో కేసీఆర్ తీరును కాళేశ్వరం కమిషన్ తప్పు పట్టింది. దీంతో కేసీఆర్ లక్ష్యంగా అధికార పక్షం కాళేశ్వరంపై చర్చించనుంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం చెబుతారా.. లేక కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడుతారా అనేది తెలియాల్సి ఉంది.
KCR | వాడీవేడిగా..
అసెంబ్లీ సమావేశాలు (assembly sessions) వాడీవేడిగా సాగనున్నాయి. మూడు, నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉండగా.. యూరియా కొరత, రైతుల సమస్యలు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశాలను సభలో లేవనెత్తడానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతోంది.