అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతిలో ముఖ్యమంత్రి రేఖ లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-Elections) నేపథ్యంలో ఆయన ఆదివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.
సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. సొంత చెల్లికి, మాగంటి తల్లికి న్యాయం చేయలేనివాడు కేటీఆర్ అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుజరాత్‌కు గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడటం లేదన్నారు. తనపై ఎగరడం కాదని, మోదీ దగ్గర మాట్లాడాలని హితవు పలికారు.
CM Revanth Reddy | సహకరించడం లేదు
కేటీఆర్‌తో కిషన్‌రెడ్డి (Kishan Reddy) చెడు స్నేహం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణకు సహకరించడం లేదని విమర్శించారు. తాము కుర్చీలో కూర్చుంటే భరించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) పెట్టుబడులను కిషన్‌రెడ్డి గుజరాత్‌కు తీసుకు వెళ్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ (KTR)తో సవాసం ఆపేయాలని ఆయనకు సూచించారు. వాళ్ల నాన్నే వదిలేసి దూరంగా ఉంటున్నారని చెప్పారు.
CM Revanth Reddy | కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లు అయిందని సీఎం (CM Revanth Reddy) తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. 2004లో ఉచిత కరెంట్ పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ అమలు చేశారని, కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి జలయజ్ఞం చేపట్టారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్మించిన అమరవీరుల స్థూపం, సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్‌తో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యిందన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు.
CM Revanth Reddy | గెస్ట్‌హౌజ్‌లో ఎవరు ఉంటున్నారో?
జూబ్లీహిల్స్ గల్లీల్లో చెత్త ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని సీఎం అన్నారు. మూడుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారని, అప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్ కల్చర్‌కు ఎవరు కారణమో ప్రజలు ఆలోచించాలని సూచించారు. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. సినీతారలతో గెస్ట్‌హౌస్‌లలో ఎవరు ఉంటున్నారో చూడండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy | బెదిరించడానికి కాలేజీలు బంద్ పెట్టారు
తనను బెదిరించడానికి ప్రైవేట్ కాలేజీలు బంద్ చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరు నెలలు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. విద్య వ్యాపారం కాదు, సేవ అని మరోసారి స్పష్టం చేశారు. పంతాలు, పట్టింపులకు పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. రూల్స్ ప్రకారం వెళ్దామంటే తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వందశాతం రూల్స్ పాటించే కాలేజీలకు తక్షణమే బకాయిలు చెల్లిస్తానన్నారు.
