అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరిచి అరిచి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎవరినైనా కరిచేలా ఉన్నారన్నారు. ఆయనను కట్టేయాలని సీఎం భార్య గీతమ్మను కోరుతున్నట్లు చెప్పారు. లేదంటే రోజు అరిచి అరిచి పిచ్చిలేసి ఎవరినైనా కరిచే లాగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం (Serilingampally Constituency) ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి శుక్రవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అరికెపూడి గాంధీ బెదిరింపులను లెక్క చేయకుండా వేలాది మందితో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లోకి చేరేందుకు వచ్చిన అనిల్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
KTR | కూల్చివేతలు.. పేల్చివేతలు
మార్పు.. మార్పు అంటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో కూల్చివేతలు, పేల్చివెతలు, ఎగవేతలు మాత్రమే చేస్తుందన్నారు. హైడ్రా పేరిట హైదరాబాద్ నగరంలోని పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని చేయలేదన్నారు. కాంగ్రెస్ నాయకులే గతంలో కాళేశ్వరం (Kaleshwaram)లో మేడిగడ్డను పేల్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు రెండు మూడు చెక్ డ్యాములు పేల్చి ఇసుక అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఇక ఎగవేతల గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేశారన్నారు.
KTR | బారాబర్ చెబుతా
కేటీఆర్ తన తండ్రి పేరు చెప్పుకుంటున్నారని ఇటీవల రేవంత్‌రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘‘మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ (Telangana) తెచ్చినోడు.బారాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా’ అన్నారు. రేవంత్‌రెడ్డి మంచి పనులు చేస్తే ఆయన పిల్లలు కూడా పేరు చెప్పుకుంటారని తెలిపారు. చెడ్డ పనులు చేస్తే ఆయన మనవడు కూడా రేవంత్‌రెడ్డి పేరు చెప్పడన్నారు. దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, ఢిల్లీకి పైసలు ఇచ్చుడు తమతో కాదన్నారు. తాము తెలంగాణ పౌరుషంతో బతుకుతామన్నారు. రేవంత్‌రెడ్డిలాగా ఢిల్లీకి గులాముల లెక్క బతకమని ఎద్దేవా చేశారు.