అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్‌రెడ్డిని ఉరి తీయాలన్నారు.
కృష్ణా జలాలపై శనివారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన కేసీఆర్, హరీశ్‌రావును ఉరితీయాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
KTR | నాలుగు భాషల్లో తిట్లు వచ్చు
రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బడివే అని అన్ పార్లమెంటరీ భాష మాట్లాడుతుంటే స్పీకర్ చూస్తూ కూర్చోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. సీఎం తన అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నారని అందరికీ అర్థమైందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంగుష్టమాత్రులు, కుక్క మూతి పిందెలని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఇవాళ ఆ అంగుష్టమాత్రులు అనే పదానికి రేవంత్ రెడ్డి సరిపోతారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఒక భాషలోనే తిట్లొచ్చేమో, మాకు మూడు నాలుగు భాషల్లో తిట్లొచ్చని కేటీఆర్ అన్నారు. సీఎంకు బేసిన్లు తెలియదని, ట్రిపుల్ ఐటీ, ఐఐటీకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
KTR | మాట తప్పినందుకు
రెండు లక్షల జాబ్స్ ఇస్తానని మాట తప్పిన రాహుల్ గాంధీని అశోక్ నగర్ నడి చౌరస్తాలో ఉరి తీయాలని కేటీఆర్ అన్నారు. రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పినందుకు వరంగల్‌లో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లు కాంగ్రెస్ పార్టీని ఉరి తీయాలన్నారు.
నదీ జలాలపై దశాబ్దాలుగా కాంగ్రెస్ రాష్ట్రానికి ద్రోహం చేస్తోందన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను కేసీఆర్ సాధించారని చెప్పారు. అధికారమదంతో మిడిసిపడుతూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. పదే పదే కేసీఆర్ చావు కోరుకునే రాబందు రేవంత్‌రెడ్డి అన్నారు.