అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నేపథ్యంలో నిరంతరం కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండటానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన విజయోత్సవాల పేరిట డిసెంబర్ 1 నుంచి 9 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సైతం దీక్ష దివస్ (Deeksha Diwas) పేరిట ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) తాజాగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఈ నెల 9న విజయ్ దివస్‌గా జరుపుకోవాలని ఆయన సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సంబరాలు చేసుకోవాలన్నారు. కేసీఆర్ అమరణ దీక్షకు పూనుకోవడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రారంభించినట్లు నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం (Union Home Minister Chidambaram) ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా (Vijay Diwas) ఘనంగా నిర్వహించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు.
KTR | చరిత్రలో నిలిచిపోయే రోజు!
కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ (KCR) 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా ‘విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఒక రూపం వచ్చిందని కేటీఆర్ అన్నారు.
KTR | కార్యక్రమాల వివరాలు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలన్నారు. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి (BR Ambedkar statue) పూలమాలలు వేసి నివాళులర్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సూచించారు.
KTR | నిమ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం
కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో (Gandhi Hospital) తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నగర నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.