అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR on Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గులాబీ సైనికులకు ఆయన అభినందనలు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కార్యకర్తలు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్కు కొండంత బలాన్నిచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో దౌర్జన్యకాండకు దిగారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అక్రమంగా లూటీ చేసిన ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలని కాంగ్రెస్ యత్నించిందన్నారు.
KTR on Municipal Elections | మూల్యం తప్పదు
పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలకిచ్చిన హామీలను, పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్ సంక్షోభంలోకి నెట్టిందన్నారు.
KTR on Municipal Elections | అధికార దుర్వినియోగం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం అన్నారు.