అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Krishna River | ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో (Andhra Pradesh) నదిపై గల అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పోటెత్తడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌కు (Jurala Project) భారీగా వరద వస్తోంది. అధికారులు విద్యుత్ ఉత్పత్తి, వరద గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) భారీగా ఇన్‌ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్ 8 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20 వేల క్యూసెక్కులు, దిగువకు 2.82 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.
Krishna River | నిండుకుండలా పులిచింతల
ఇప్పటికే నాగర్జున సాగర్ (Nagarjuna Sagar) నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 2,82,364 క్యూసెక్కుల వరద చేరుతోంది. 26 గేట్ల ద్వారా 2.65 లక్షల క్యూసెక్కులను పులిచింతలకు వదులుతున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్ట్ కూడా నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వచ్చిన ప్రవాహాన్ని అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో నీటినిల్వ 41.58 టీఎంసీల నీరు చేరడంతో 12 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు.
Krishna River | గంట గంటకు పెరుగుతున్న వరద
ప్రకాశం బ్యారేజీకి (Prakasham Barrage) గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో 15 గేట్లను 7 అడుగులు మేర, 55 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీకి మొత్తం 2,77,784 క్యూసెక్కుల వస్తుండగా.. సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187, పశ్చిమ కాలువకు 6,522, గుంటూరు ఛానెల్‌కు 200 క్యూసెక్కుల వదులుతున్నారు.