అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో నాగార్జున సాగర్‌కు భారీగా వరద (Heavy Flood) వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నీటి మట్టం 546 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్లను (Project Crestgates) నీటిమట్టం తాకడం గమనార్హం.
ప్రతి సంవత్సరం ఆగస్టులో నాగార్జున సాగర్‌కు వరద వస్తుంది. అయితే ఈ ఏడాది నెల రోజుల ముందుగానే జలాశయంలోకి వరద రావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project) నుంచి నాగార్జున సాగర్‌కు 1,48,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 546 అడుగులకు చేరింది. దీంతో అధికారులు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించారు. కరెంట్ ఉత్పత్తి చేసి 13,566 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ మరో వారం రోజుల్లో నిండే అవకాశం ఉంది.
Nagarjuna Sagar | శ్రీశైలంలో పర్యాటకుల సందడి
ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తారు. మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగర్జున సాగర్(Nagarjuna Sagar) వైపు పరుగులు తీస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో సందడి నెలకొంది. శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.