అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar | ఎగువ నుంచి కృష్ణానదికి (Krishna river) వరద తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా ఉధృతంగా పారుతున్న కృష్ణమ్మ శాంతించింది. దీంతో ప్రాజెక్ట్‌లలోకి ఇన్‌ఫ్లో తగ్గింది. జూరాల ప్రాజెక్ట్‌కు (Jurala project) వదర తగ్గడంతో దిగువకు 75 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సుంకేశుల నుంచి 15 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam reservoir) 1.03 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ వద్ద గల కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. డ్యామ్ నుంచి మొత్తం 1.60 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
Nagarjuna Sagar | పర్యాటకుల తాకిడి..
ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఆదివారం నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) వరద గేట్లను మూసి వేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే మళ్లీ గేట్లు ఓపెన్ చేస్తామని వారు ప్రకటించారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కాగా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో జలాశయం వద్ద జల సవ్వడులు చూడటానికి భారీగా పర్యాటకులు వచ్చారు. శ్రీశైలం డ్యామ్‌కు నిత్యం భారీగా ప్రజలు వస్తున్నారు.