HomeUncategorizedKakinada | కాకినాడ‌లో దారుణం.. చెల్లితో మాట్లాడుతున్నాడని యువకుడిని చంపేశారు..!

Kakinada | కాకినాడ‌లో దారుణం.. చెల్లితో మాట్లాడుతున్నాడని యువకుడిని చంపేశారు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakinada : కాకినాడ జిల్లా పి.వేమవరం గ్రామంలో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ యువతిని ల‌వ్ చేస్తున్నాడ‌నే అనుమానంతో ఈ దారుణానికి పాల్ప‌డ్డారు.

వివరాల్లోకి వెళితే.. పి. వేమవరం గ్రామానికి చెందిన నులకతట్టు కృష్ణప్రసాద్ తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. అయితే కిరణ్ కార్తీక్ అనే యువకుడు తన చెల్లితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, ప్రేమిస్తున్నాడని అనుమానించాడు. దీంతో కిరణ్‌ను మందలించగా, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Kakinada : ఇంత దారుణ‌మా?

గత జూన్ 24న కృష్ణప్రసాద్ తన స్నేహితుడు దూళ్లపల్లి వినోద్‌తో కలిసి కిరణ్ కార్తీక్‌ను “పార్టీ ఇస్తామంటూ” బ్రహ్మానందపురం జగనన్న లేఔట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కిరణ్‌ను దారుణంగా తలను నేలకేసి కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే మట్టిలో పూడ్చి, రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయాడు.

కిరణ్ కార్తీక్ కనిపించకుండా పోవడంతో, అతని తండ్రి వీరవెంకట రమణ జూన్ 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ఫోన్ కాల్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో భయపడిన కృష్ణప్రసాద్, జులై 4వ తేదీ శుక్రవారం సామర్లకోటకు వచ్చి వినోద్‌ను కలిసి వీఆర్వో ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీనితో వీఆర్వో ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు.

తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మట్టిలో పూడ్చిన కార్తీక్ మృతదేహాన్ని వెలికితీశారు. అప్పటికే పది రోజులు కావడంతో మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తమ కుమారుడిని కిరాతకంగా హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్తీక్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులపై విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.