అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kranthi Goud | భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి గౌడ్ , మైదానంలో వికెట్లతోనే కాదు.. తన కుటుంబ జీవితంలోనూ ఆనందం నింపింది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయి అవమానం ఎదుర్కొన్న ఆమె తండ్రి మున్నాసింగ్ గౌడ్‌కు, కూతురు కృషి వల్ల మళ్లీ గౌరవం దక్కింది.
13 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడిన ఆయనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh Government) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఛతర్‌పూర్ జిల్లా (Chhatarpur District)కు చెందిన మున్నాసింగ్ గౌడ్ గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. 2012 ఎన్నికల సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.
Kranthi Goud | పోయిన గౌరవం దక్కింది..
ఆ ఒక్క నిర్ణయం కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఇంట్లో ఆదాయం లేకపోవడంతో క్రాంతి సోదరులు కూలీ పనులు, బస్సు కండక్టర్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఈ కష్టాల మధ్య కూడా క్రాంతి తన కలను వదలకుండా క్రికెట్‌పై పూర్తిగా దృష్టి పెట్టి కఠిన సాధన కొనసాగించింది. ఆ కృషి ఫలితమే ఆమెకు భారత జట్టులో చోటు. ఇటీవల ముగిసిన మహిళా వన్డే ప్రపంచకప్‌లో క్రాంతి గౌడ్ కీలకంగా రాణించింది. 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి భారత జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. నవంబర్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (MP CM Mohan Yadav) చేతుల మీదుగా సన్మానం అందుకున్న సందర్భంగా, క్రాంతి తన కుటుంబం ఎదుర్కొన్న బాధను భావోద్వేగంగా వివరించింది.
తన తండ్రి మళ్లీ పోలీస్ యూనిఫాం ధరించి, గౌరవంగా పదవీ విరమణ చేయాలని తన కోరికను సీఎంకు చెప్పింది. ఆమె మాటలకు స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే సానుకూల హామీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా, పోలీస్ ప్రధాన కార్యాలయం మున్నాసింగ్ గౌడ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా క్రీడల శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ (Sports Minister Vishwas Sarang) మాట్లాడుతూ, “క్రీడాకారుల ప్రతిభను మాత్రమే కాదు, వారి వ్యక్తిగత పోరాటాలను కూడా ప్రభుత్వం గౌరవిస్తుంది. క్రాంతి గౌడ్ దేశానికి తెచ్చిన కీర్తిని గుర్తించి ఆమె కుటుంబానికి న్యాయం చేశాం” అని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రాంతి గౌడ్‌కు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా ప్రకటించింది.