అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kothagudem Mayor | కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడటంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఐ మేయర్ పదవిని పంచుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్ల ఉన్నాయి. సీపీఐ (CPI), కాంగ్రెస్ పార్టీలు చెరో 22 స్థానాల్లో విజయం సాధించాయి. బీఆర్ఎస్ 8, సీపీఎం 1, బీజేపీ 1, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలుపొందారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. 31 సీట్లు ఉంటే మేయర్ పదవి దక్కించుకోవచ్చు. ఈ క్రమంలో తాము సీపీఐకి మద్దతు ఇస్తామని కేటీఆర్ (KTR) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
Kothagudem Mayor | చెరో రెండున్నరేళ్లు
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం ఉదయం సీపీఐ నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నర్సింహతో సమావేశం అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం పాల్గొన్నారు. కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్‌పై ఆయన వారితో చర్చించారు. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి తీసుకోవడానికి ఇరు పార్టీలు అంగీకరించినట్లు సమాచారం. ముందుగా సీపీఐ మేయర్ పీఠంపై కూర్చొనున్నట్లు తెలిసింది. అనంతరం కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మేయర్ పదవి పొందిన అభ్యర్థులు రెండున్నరేళ్ల తర్వాత రాజీనామా చేయకపోతే ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. నాలుగేళ్ల వరకు అవిశ్వాసం ప్రవేశ పెట్టే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్‌కు మొదట అవకాశం ఇస్తే తమకు అధికారం సాధ్యం కాదని సీపీఐ భావించినట్లు సమాచారం. మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారనేది సోమవారం తేలనుంది.
Kothagudem Mayor | కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) సమక్షంలో ఆదివారం ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. సీపీఎంతో కలుపుకొని కాంగ్రెస్ బలం 28కి చేరింది. మెజారిటీకి మరో 3 సీట్లు తక్కువగా ఉండటంతో సీపీఐతో కలవడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు తాము సీపీఐకి మద్దతు తెలపకపోతే బీఆర్ఎస్ సాయంతో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందని హస్తం పార్టీ భావిస్తోంది.
1 comment
[…] BT Roads for Thandas | అన్ని తండాలకు బీటీ… Kothagudem Mayor | కొత్తగూడెం మేయర్ పదవిపై కాంగ… Maha Shivaratri Temple Rush | శివాలయాల్లో భక్తుల […]
Comments are closed.