అక్షరటుడే, వెబ్డెస్క్ : Kondapur HYDRAA Demolitions | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. రూ.వందల కోట్ల విలువైన భూములను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది.
నగరంలోని కొండాపూర్లో తాజాగా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీ (Rajarajeshwari Colony)లో ప్రజా సౌకర్యాల కోసం ఉద్దేశించిన కమ్యూనిటీ భూమిని కొందరు ఆక్రమించారు. ఈ మేరకు స్థానికులు హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. కొండాపూర్ గ్రామం (Kondapur Village)లోని సర్వే నంబర్ 78/93లో దాదాపు 7 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఆ భూమి విలువ రూ.700 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తెల్లవారుజామున ఆ భూమిలో ఆక్రమణలను తొలగించారు.
Kondapur HYDRAA Demolitions | పోలీసు బందోబస్తు మధ్య..
ఆక్రమణల కూల్చివేత నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్రమణల తొలగింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా (Hydraa)కు ధన్యవాదాలు తెలిపారు. కాగా హైడ్రా అధికారులు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలను పరిష్కరిస్తున్నారు.