Kondapur Flyover inaugurated soon
Kondapur Flyover | త్వరలో కొండాపూర్ – గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kondapur Flyover | హైదరాబాద్​(Hyderabad)లో ట్రాఫిక్​ ఇక్కట్లు అన్నిఇన్ని కావు. మహా నగరంలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది.

దీంతో ప్రజలు ట్రాఫిక్​ సమస్య(Traffic Problems)తో ఇబ్బంది పడుతున్నారు. సాఫ్ట్​వేర్​ కంపెనీలు కొలువదీరిన కొండాపూర్​(Kondapur), గచ్చిబౌలి(Gachibowli) ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ట్రాఫిక్​ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండాపూర్​–గచ్చిబౌలి మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ను జూన్​ మొదటి వారంలో ప్రారంభించాలని నిర్ణయించింది.

గచ్చిబౌలి- కొండాపూర్ ఫ్లై ఓవర్ (Gachibowli-Kondapur Flyover)​ను రూ.172 కోట్లతో 1.2 కిలోమీటర్ల మేర నిర్మించారు. దీనిని జూన్​ మొదటి వారంలో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఇక్కడ త్రీ లెవెల్​ ఫ్లై ఓవర్​లను ప్రభుత్వం నిర్మించింది. మొదటి దశలో గచ్చిబౌలి జంక్షన్​ ఫ్లై ఓవర్​ నిర్మించారు.

లెవల్​ –2లో శిల్పా లేఔట్ ఫేజ్​–1 ఫ్లై ఓవర్​ నిర్మించారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం చేయడానికి మూడో దశలో 1.2 కిలోమీటర్ల మేర మరో ఫ్లై ఓవర్​ నిర్మించారు. దీంతో గచ్చిబౌలి నుంచి ఓఆర్​ఆర్,​ హైటెక్ ​సిటీ వెళ్లడానికి సమయం ఆదా కానుంది.